You are here

రవితేజకు ఏ అలవాటు లేదు !

టాలీవుడ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసు గురించి చాలా వివరాలు బయటకు వచ్చాయి. ప్రముఖ నటుడు రవితేజ పేరు రావడంతో ఆయన తల్లి రాజ్యలక్ష్మి స్పందించారు. భరత్‌ మరణం, రవితేజపై డ్రగ్స్‌ ఆరోపణలపై స్పందించేందుకు ఆమె సోమవారం మీడియా ముందుకు వచ్చారు. రవితేజకు కనీసం సిగరెట్‌ తాగే అలవాటు లేదన్నారు.. అలాంటి వాడిని డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రవితేజ ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదన్నారు. పుట్టెడు దుఃఖంలోనే రవితేజ సినిమాలు చేస్తున్నాడని తెలిపారు రాజ్యలక్ష్మి. నిర్మాతలకు నష్టం కలిగించవద్దనే రవితేజ షూటింగ్‌కు వెళ్లాడని చెప్పారు. తమ కుటుంబం ఆచారం ప్రకారం భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదన్నారు.

మద్యం మత్తులోనే రోడ్డుప్రమాదంలో భరత్‌ చనిపోయాడనేది అవాస్తవమని రాజ్యలక్ష్మి అన్నారు. భరత్‌ చనిపోయే కొద్దిరోజుల ముందే చెడు అలవాట్లను మానేశాడని.. బిగ్‌ బాస్‌ షోకు కూడా ఎంపికయ్యాడని.. ఆ ప్రయత్నంలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భరత్‌ను దారిలో పెట్టేందుకు తాను రేయింబవళ్లు కనిపెట్టుకుని ఉండేదాన్నని ఆమె చెప్పారు. రవితేజ, భరత్‌ను ముడిపెట్టి చూడొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదిలావుంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి నోటీసులు అందుకోని కొందరు నటీనటులు బ్యాంకాక్ చెక్కేద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఐతే ఎక్సైజ్ అధికారులు మాత్రం ఈ నెల 19 నుంచి 27వ తేదీ మధ్యన నాంపల్లి ఎక్సయిజ్ ఎన్ఫోర్స్‌మెంట్ కార్యాలయం ఎదుట హాజరై వివరణ ఇచ్చిన తర్వాతే వెళ్లాలనీ, దానికి భిన్నంగా ప్రవర్తిస్తే అరెస్ట్ తప్పదని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇప్ప‌టికే 12 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు రెండో లిస్టులో మ‌రికొంత మంది ప్ర‌ముఖుల‌కు నోటీసులు ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Related Articles