ప్రధానిలా కాదు.. కార్యకర్తలా పనిచేశారు-అమిత్ షా

Amit Shah Said To Karnataka Elections Victory Speech

కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీ నేతల్లో కొత్త జోష్ ని తీసుకువచ్చాయి. కర్ణాటకలో 104 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది అతిపెద్దగా పార్టీగా బీజేపీ అవతరించింది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోడీ ప్రధానిలా కాకుండా ఓ కార్యకర్తలా పనిచేశారంటూ ప్రశంసలు కురిపించారు.

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మ్యాజిక్‌ ఫిగర్ కు బీజేపీ కేవలం 7 స్థానాల దూరంలో మాత్రమే నిలిచిపోయిందన్నారు. దేశవ్యతిరేక కూటములతో జతకట్టిన కాంగ్రెస్ కు కన్నడ ప్రజలు తగిన బుద్ది చెప్పారని తెలిపారు. లింగాయత్ లకు మైనార్టీ హోదా అంటూ కాంగ్రెస్ నాటకాలాడిందన్నారు. జాతులు, డబ్బు, బలప్రయోగాల ద్వారా గెలవాలని ప్రయత్నించారు. నకిలీ ఓటర్ ఐడీలను సైతం సృష్టించారని షా విమర్శించారు.

కాంగ్రెస్ ఎన్నిప్రయత్నాలు చేసినా… కన్నడ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని షా తెలిపారు. కర్ణాటక ఎన్నికలతో కాంగ్రెస్ నేతల్లో భయపుట్టుకుంది. ఇక సిద్దరామయ్య ఓ స్థానంలో ఓడిపోయి, మరోస్థానంలో చావుతప్పి గెలిచారని ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం తర్వాత పూర్తి స్థాయి మెజార్టీతో ఏర్పడిన ప్రభుత్వం.. మోడీ ప్రభుత్వం అన్నారు. 2022లో న్యూ ఇండియా కలను బీజేపీ సాకారం చేస్తుందని అమిత్ షా అన్నారు.