క్షీర విప్లవం రావాలి..

CM KCR meets dairy farmers at pragathi bhavan
CM KCR meets dairy farmers at pragathi bhavan

ప్రగతి భవన్‌లో పాల ఉత్పత్తిదారులతో  నేడు(శనివారం) సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కేసీఆర్ మాట్లాడుతూ.. ‘చాలా కష్టపడి, పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. రాష్ట్రం బాగుండాలి.. రైతులు బాగుండాలి.. మనం బాగుండాలని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఏం పరిపాలన జరిగిందో.. ఏం జరిగిందో కానీ అరవై ఏళ్లలో ఏ ఒక్కటి కూడా బాగాలేదు. మన రాష్ట్రం వచ్చినా నాటికి చూస్తే.. ఎరువులు సరఫరా కావు.. ఎరువులు దుకాణాల ముందు చెప్పుల లైన్లు.. విత్తనాలు దొరకవు.. కరెంటు ఉండదు.. ఇంత అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఉన్నాం. చేపలు దొరకవు.. ఆంధ్రా నుండి వచ్చే చేపల్ని తినాల్సిన దుస్థితి.. ఎండిపోయిన చేపలు కూడా కొనుక్కొని తినాల్సి వస్తుంది. అందుకోసమే మత్స్యకారులకు చేపలు పంపిణీ చేశాం. కోటీ మంది జనాభా ఉన్న నగరంలో పదిశాతం మాత్రమే మనం పండించిన కూరగాయలుంటాయి. మిగిలిన 90 శాతం బయటినుండే వస్తాయి. ఇక పాల పరిస్థితి అదే తీరుగా ఉంది. తెలంగాణ మొత్తం కలిసి ఏడు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణలో అవసరం మేరకు పాలు దొరకడం లేదు. రాష్ట్రంలో కోటీ లీటర్ల పాలు అవసరం. అందుకు మనమే ఉత్పత్తి చేయాలి. రాష్ట్రంలో క్షీర విప్లవం రావాలి. గ్రామీణ వ్యవస్థ బాగుపడాలి’ అన్నారు.

రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మారాలని ఒక్కొక్కటీ సర్దుకుంటూ పోతున్నామన్నారు సీఎం. పేదలకు, వృద్దులకు, వితంతులకు ఆసర కోసం పెన్షన్ వెయ్యి రూపాయలు చేసినామన్నారు. ఇంత చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు . అంతేకాకుండా ‘భూరికార్డుల సర్వేకు రైతులు సహకరించాలి. భూమున్న ప్రతి రైతుకు రికార్డులు సరిగా ఉంచుకోండి. వచ్చే సంవత్సరం నుండి రైతుల అకౌంట్లోనే డబ్బులు పడతాయి. ఎవరి సిఫార్సులు అవసరం లేదు. రైతుల సంఘాలు సహకరించుకోవాలి. ధర కూడా అనుకూలంగా ఉంటుంది. అందరూ ఒక్కసారిగా తీసుకుపోవద్దు.. కొన్ని గ్రామాలు కలిసి తీసుకుపోవాలి. ధర మనమే నిర్ణయించే పరిస్థితి రావాలి. రూ. 5000 కోట్లు అకౌంట్లో వేస్తాం. ప్రభుత్వమే అన్నీ కొంటుంది. దళారుల దోపిడి నుండి భయటపడేయడానికి రైతు సమన్వయ సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం’ అని  తెలిపారు

దసరాకు ముందే 24వ తేది నుండి రూ. 4 ఇన్సెంటివ్ ఇస్తామన్నారు సీఎం. ‘రాష్ట్రంలో రెండు లక్షల మంది పాడి రైతులున్నారు. ఈ రెండు లక్షల రైతులకు ఇంటికో ఆరు చెట్లు ఇస్తా.. ఖచ్చితంగా పెంచాలి. పెంచకపోతే నామీద ఒట్టే. చెట్టుకు కుటుంబ సభ్యలు పేరు పెట్టాలి. చెట్టు పోతే నేను పోయిండ్రా అనుకోవాలె. నా కోరిక తీరుస్తారా. చెట్లను మంచిగా చూసుకోకపోతే పటాలాన్ని తీసుకొని మీ ఇంటికి భోజనానికి వస్తా.. ఒక్క రోజు భోజనం పెడితే ఏడాది కాసం పోతది’అని ఈ సంధర్బంగా కేసీఆర్ జోక్ పేల్చారు. ఇదే క్రమంలో50 శాతం సబ్సిడీ మీద బర్రెలు కొనిస్తా. సగం మీరు కట్టాలి. పాల ఉత్పత్తి పెంచాలి. ఏడు లక్షల లీటర్ల పాలను.. పది లక్షలకు పెంచాలి. రాష్ట్రంలో క్షీర విప్లవం తీసుకురవాడనికి పెద్ద స్కీమ్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తా. ఏదైనా చేసి బర్రెలు కొనిస్తా. అర్హులు 50 శాతం, బీదవాళ్లకు 75 శాతం సబ్సీడి ఇద్దాం’ అని తెలిపారు సీఎం కేసీఆర్.