జూన్‌ 2లోగా రైతులందరికీ చెక్కులు:కేసీఆర్

రైతు బంధు పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆధార్ అనుసంధానంలో జాప్యం వల్ల కొంతమంది రైతులకు పాస్ బుక్కులు అందలేదని తెలిపారు. ప్రగతి భవన్‌లో ఇవాళ రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియపై కూడా సీఎం సమీక్షించారు. ఏ ఒక్క రైతు మిగలకుండా పాస్ బుక్కులు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం వస్తుందని అప్పటివరకు రైతులందరి పాస్ బుక్కులు అందాలని, రికార్డులు అప్ డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

CM KCR Review Meet On Rythu Bandhu Scheme

సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల కొద్దిమందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు రాలేదని, కొన్ని చోట్ల చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందిందని తెలిపారు. రైతు బంధు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. పాస్ బుక్స్, రైతుబంధు చెక్కులు తీసుకోని వారెవరైనా ఉంటే.. తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలని సూచించారు. పంట పెట్టుబడి సాయం చేతికందిన తర్వాత రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు.

ఎక్కడికీ తిరగకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా భూరికార్డులు సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి సాయం అందించడం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు మహముద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ ఎస్‌కే జోషి, వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థిక శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

మరోవైపు రేపు ప్రగతి భవన్‌లో కలెక్టర్లు,మంత్రులతో కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై మరోసారి సీఎం సమీక్షించనున్నారు. రైతు బీమా, తెలంగాణ కంటి వెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయతీరాజ్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సీఎం చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు.