తెలంగాణకు నెంబర్ 1 విలన్‌..కాంగ్రెస్

Congress No villain for Telangana

అసెంబ్లీ వ్యవహారాల విషయాల్లో చాలా కఠినంగానే ఉంటామనే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇద్దరి సభ్యులపై శాసన సభ్యత్వాన్ని రద్దు చేశామని మరో ఇద్దరిపై వేటు పడే అవకాశం ఉందన్నారు. సీసీ పుటేజ్ ఆధారంగా సభ్యులపై వేటు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

తమ ప్రభుత్వం పూర్తి ప్రజాస్వామ్య బద్ధంగా ఉందన్నారు.పరిమితికి లోబడి ఆందోళన చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పాదయాత్రలు,బస్సుయాత్రలు చేస్తే అడ్డుకున్నామా అని ప్రశ్నించారు.తెలంగాణ హరిగోసకు కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆనాడే చెప్పానన్నారు. నాటి నుంచి నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ సభ్యుల ప్రవర్తన అదేవిధంగా ఉందన్నారు.

బస్సుయాత్ర చేయాలంటే ఢిల్లీ పర్మిషన్ కావాలి…రాజీనామాలు చేయాలంటే ఢిల్లీ పర్మిషన్ కావాలని ఎద్దేవా చేశారు.తెలంగాణ ప్రజల మనోభావాలను కాలరాసింది కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు.1969 ఉద్యమాన్ని నీరుగార్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.జానారెడ్డి తెలంగాణ ఫోరం పెట్టి మంత్రి పదవి ఇవ్వగానే పక్కకు జరిగారన్నారు.చిన్నారెడ్డి సైతం అదేబాటలో రాజశేఖర్ రెడ్డికి లొంగిపోయారని తెలిపారు.

నాడు తెలంగాణ వద్దన్న కాంగ్రెస్ నాయకులు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పిచ్చిమాటలు మాట్లాడాలన్నారు. కేసీఆర్‌ను ఉరితీయాలని ఓ ఎమ్మెల్యే మాట్లాడాడని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు ఓటేయకుంటే ఆంధ్రాలో కలిపేస్తామన్నారు. ఇది కాంగ్రెస్ నాయకుల నిజస్వరూపానికి నిదర్శనమన్నారు. పదవుల కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని మండిపడ్డారు. తెలంగాణ రైతులపై కాంగ్రెస్ నాయకులకు ఏనాడు ప్రేమ లేదన్నారు.