రైతు బంధుతో కాంగ్రెస్ దుకాణం బంద్‌:కేటీఆర్

Congress will be lost in Rythu Bandhu tsunami says KTR

రైతు బంధు పథకం ఆత్మసంతృప్తినిచ్చిందని తెలిపారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో రైతు బంధు కార్యక్రమంలో భాగంగా చెక్కులు పంపిణీ చేసిన కేటీఆర్….ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చామన్నారు. రైతు బంధు పథకంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. వ్యవసాయాన్ని పండగే చేసేందుకే రైతు బంధు పథకం అన్నారు.

కరెంట్ కోసం నాడు ధర్నాలు జరిగేవని కానీ నేడు ఆ పరిస్ధితి మారిందన్నారు. అందరికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేశామన్నారు. రైతు బంధు ఎన్నికల స్టంట్ కాదని…సంవత్సరం ముందే రైతులతో కేసీఆర్ చెప్పారని స్పష్టం చేశారు కేటీఆర్.

గత పాలకులు రూ.200 పెన్షన్‌ కోసం ముప్పు తిప్పలు పెట్టారని కానీ నేడు ఎలాంటి ఇబ్బందిపెట్టకుండా పారదర్శకంగా రూ.1000 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రైతు పెట్టుబడి పథకంపై అవాకులు,చవాకులు పేలుతున్నారని చెప్పారు. కల్యాణ లక్ష్మీ,సన్నబియ్యం,కేసీఆర్‌ కిట్‌,ఆరోగ్య లక్ష్మీ పథకాలు కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాయువేగంతో పూర్తి చేస్తున్నామని చెప్పారు.

కౌలు రైతులపై ప్రభుత్వానికి ప్రేమ ఉందన్నారు. రైతు కళ్లల్లో ఆనందం చూస్తుంటే కాంగ్రెస్ నాయకుల కళ్లు మండుతున్నాయని చెప్పారు. రైతు బంధుతో కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో తప్పులు ఉంటే సూచించాలని కానీ ప్రతిపనిని తప్పుబట్టడం సరికాదన్నారు. కొత్త గోదాముల నిర్మాణం చేపట్టి 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి
తీసుకుపోయామని చెప్పారు. వచ్చే యాసంగి పంటకు కాళేశ్వరం నీళ్లు అందించి తీరుతామన్నారు.

రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర రావాలన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేశామన్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. సరికొత్త పంటభీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. రైతు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా రూ. 5 లక్షల ప్రమాద భీమా తీసుకురాబోతున్నామని చెప్పారు.జూన్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించనున్నారని చెప్పారు. గల్ఫ్‌ వెళ్లిన తెలంగాణ బిడ్డలు తిరిగిరావాలని సూచించారు కేటీఆర్. తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందన్నారు. సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామని చెప్పారు.