ఆన్‌లైన్‌లో పిడకల వ్యాపారం..!

జనం అవసరాలను పలు కంపెనీలు వ్యాపారంగా మార్చుకోవడం సర్వసాదారణమైపోయింది. అంతేనా వాటికి డిమాండ్ కూడా బాగానే వుంటుంది. అయితే ఇప్పుడు అలాంటి కొత్త వ్యాపారం మొదలుపెట్టింది వ్యాపార దిగ్గజం అమెజాన్‌. ఆ వ్యాపారం ఎంటనేగా మీ సందేహం.. ఆన్‌లైన్‌లో పిడకల వ్యాపారం..! ఒక్కొ పిడకకు రూ.15..! ఇదంతా వినడానికి అశ్చర్యం కలిగిస్తున్నా.. ఇది వాస్తవం.

Cow Dung Cakes (Pidakalu) Selling Online

ఆవు పేడతో చేసిన పిడకలతో భోగిమంటలు వేయడం సంప్రదాయం. అయితే నేడు అవి దొరకక, కర్రలు, ఇంట్లో పాత సామగ్రి బయట పడేసిన టైర్లు వేసి భోగిమంటలు వేస్తున్నారు. అయితే ఈసారి భోగి మంటల కోసం తాము పిడకలను అందిస్తామని ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ అమెజాన్‌ ప్రకటించింది. ‘ప్యూర్‌ కౌ డంగ్‌ కేక్‌’ పేరుతో విక్రయాలు సాగిస్తోంది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని హైదర్‌గూడ ప్రాంతంలో ఉంటున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు భోగి పండుగ కోసం ఈ పిడకలను అమెజాన్‌లో ఆర్డర్‌ చేశారు. అమెజాన్‌లో పిడకలు విక్రయిస్తున్నట్లు అంతటా చర్చ జరుగుతుండడంతో తాము తెలుసుకుని ఆర్డర్‌ చేశామని వినియోగదారులు తెలిపారు.

Cow Dung Cakes (Pidakalu) Selling Online

ఆన్‌లైన్‌లో ఒక్కో పిడకను రూ.15కు విక్రయిస్తోంది. ఇంటివద్దే పిడకలను అందించనున్నారు. అయితే గ్రామాల్లో మాత్రం తక్కువ ధరలకే వీటిని విక్రయిస్తున్నారు. 50 పిడకలను రూ.15 విక్రయిస్తున్నారు. పల్లెల్లో కిరాణ షాపులు, పాన్ డబ్బాల దగ్గర వీటిని దండలుగా కట్టి అమ్ముతున్నారు. గతంలో గ్రామాల్లో గ్రామస్థులకు ఉచితంగా అందించే వారు. భవిష్యత్‌లో ఆన్‌లైన్‌లో పేడనూ విక్రయిస్తారేమోనని చర్చించుకుంటున్నారు.