ఎవర్ని వదలద్దు.. మంత్రి ఉన్నా కేసు పెట్టండి:కేసీఆర్

రాష్ర్టంలో డ్రగ్స్, కల్తీల అన్ని కోణాల నుంచి లోతుగా దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌ నియంత్రణ విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని, కల్తీలకు పాల్పడడం, డ్రగ్స్ సరఫరా చేయడం లాంటి దుర్మార్గాలు తెలంగాణలో చేయలేమని అక్రమార్కులు భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని, దందాలో ఎవరి ప్రమేయం ఉన్నా వదలవద్దని స్పష్టం చేశారు. డ్రగ్స్, కల్తీలు, ఇతర సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

రక్తాన్ని కూడా కల్తీ చేసి అమ్ముతున్నారనే విషయం తెలిసి తన మనసెంతో చలించిందని, ఇలాంటి వారికి జీవితకాల కారాగార శిక్ష పడే విధంగా అవసరమైతే కొత్త చట్టాలు తేవాలని సీఎం అన్నారు. ‘హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా, వాడకం ఎప్పటి నుంచో ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడం అత్యంత అవసరం. హైదరాబాదే తెలంగాణకు లైఫ్ లైన్. కాబట్టి హైదరాబాద్ లో అరాచకం అంతం కావాలి. కేసు పరిశోధనలో ఉన్న సమయంలో సెలవులో వెళ్లవద్దని నేనే అకున్ సభర్వాల్ కు సూచించా. కేసు పూర్వోపరాలన్నీ క్షుణ్ణంగా వెలికి తీయండి. ఎవరినీ వదలద్దు. అందరినీ శిక్షించాలి. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేయలేము, వినియోగించలేము అని భయభ్రాంతులయ్యేలా మన చర్యలుండాలి. హైదరాబాద్ బాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటిగా మార్చాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ప్రభుత్వం ఈ విషయంలో అధికారులకు కావాల్సిన అధికారాలు, స్వేచ్ఛ ఇస్తున్నది. ప్రభుత్వ ఉద్దేశ్యం చాలా స్పష్టం. తెలంగాణ రాష్ట్రంలో కల్తీలు, డ్రగ్స్ దందా ఉండొద్దు. చట్ట వ్యతిరేక చర్యలకు ఈ రాష్ట్రంలో చోటు లేదు. ఎంతటి వారైనా సరే పట్టుకోండి. ఎంతటి ప్రముఖుడైనా వదలొద్దు. రాజకీయ నాయకులున్నా సరే కేసు పెట్టండి. టిఆర్ఎస్ వారి పాత్ర ఉన్నా సరే, వారిపై కేసులు పెట్టి జైలుకు పంపండి. కేబినెట్ మంత్రి ఉన్నా కేసు పెట్టండి. ప్రభుత్వానికి ఎవరినీ కాపాడాల్సిన అవసరం లేదు. అక్రమార్కుల ఆటకట్టించే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంది. మీకున్న అనుభవం, అధికారం ఉపయోగించి తెలంగాణ రాష్ట్రంలో ఈ అక్రమ దందాలను అరికట్టండి’ అని ముఖ్యమంత్రి అధికారులకు, పోలీసులకు మార్గనిర్దేశం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, సోమేశ్ కుమార్, శాంతి కుమారి, ఎక్సైజ్ కమీషనర్ చంద్రవదన్, జిహెచ్ఎంసి కమీషనర్ జనార్ధన్ రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్ రావు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్, సెక్యూరిటీస్ ఐజి ఎన్.కె. సింగ్, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్, హైదరాబాద్, వరంగల్ రేంజ్ ఐజిలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.