కోదండరాంకు నిరసన సెగ…

Formers Stop TJAC Kodandaram

టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంకు రైతుల నుంచి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మొన్న సూర్యపేట మార్కెట్‌లో కోదండరాంను అడ్డుకున్న రైతులు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కోదండరాంపై కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ను బస్వాపూర్‌ వద్ద రైతులు అడ్డుకున్నారు. రహదారికి అడ్డంగా కోదండరామ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఏ ప్రాజెక్టు తలపెట్టినా.. రాద్ధాంతం చేస్తూ అడ్డుపుల్లగా మారాడు కోదండరాం. అరాచకశక్తులతో జతకట్టి రైతన్నల నోట్లో కోదండరాం మట్టి కొడుతున్నాడని మండిపడ్డారు. తమ జీవితాలను అంధకారం చేసే కుట్రలను మానుకోవాలని కోదండరాంను రైతులు హెచ్చరించారు. కోదండరాం తమ జిల్లాలో అడుగుపెట్టొద్దని నినాదాలు చేశారు. దీంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.

రైతు బాగుపడుతుంటే కోదండరాం చూసి ఓర్వలేకపోతున్నారని రైతులు ధ్వజమెత్తుతున్నారు. కోదండరాం తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతుల్లో పావుగా మారిండని నిప్పులు చెరిగారు.
కోటి ఎకరాల మాగాణి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే సహకరించాల్సింది పోయి ప్రాజెక్టులపై కోదండరాం విష ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. ప్రాజెక్టులకు భూములు ఇవ్వొద్దని రైతులను కోదండరాం రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.  కోదండరాం ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని సుమన్ హెచ్చరించారు.