జూలై నుంచి ఉచిత కంటి పరీక్షలు:హరీష్‌

Harish Rao

పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలో మిషన్ భగీరథ రిజర్వాయర్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన అనంతరం మాట్లాడిన హరీష్ కాంగ్రెస్‌ హయాంలో పరిశ్రమలకు మూడు రోజులు పవర్ హాలీడే ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.

ఆసరా పెన్షన్లు పేదలకు బతకగలమనే భరోసా ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. రైతులకు ఎకరానికి రూ. 8వేల పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుంచి గ్రామల్లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కోటి మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తామన్నారు.

జిన్నారం గ్రామానికి కాళేశ్వరం నీళ్లు అందిస్తామని చెప్పిన హరీష్‌….వరాల జల్లు కురిపించారు. బొల్లారంలో మిషన్ భగీరథ కోసం రూ. 18 కోట్లు మంజూరు చేశామన్నారు. 10రోజుల్లో హైరిస్క్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. కళ్యాణమండపం కోసం ఎకరం స్థలం, కోటిన్నర మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

రాబోయే 52 సంవత్సరాల అవసరాలకు దృష్టిలో ఉంచుకుని పైపులైన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. దసరాలోగా ఇంటింటికీ మంజీరా నీళ్లు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.