ఫ్రీ….ఫ్రీ…ఫ్రీ.. ఇదే జయ మంత్రం

Jaya's free schemes to TN people

ఫ్రీ…ఫ్రీ….ఫ్రీ అనే పదం వింటే ఈ దేశం లో రియాక్ట్ అవని వారు ఉండరు. ఎన్నికల సమయాల్లో ఇలాంటి మాటలను రాజకీయ పార్టీలు వేదాలుగా పటిస్తుంటాయి. ఏదైనా ఫ్రీగా ఇస్తాం అంటే మనోళ్ళు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. సర్వం సిద్దం చేసుకుని అలా ఫ్రీగా ఇస్తాం అన్నవారికి పనిగట్టుకుని వెళ్లి మరే ఓటు వేసి వేస్తారు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలకు ఆల్ ఫ్రీ అనే మాట సరిగ్గా సెట్టవుతుంది. గొర్రెలు, బర్రెలు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు, ల్యాప్‌టాప్‌లు, పాఠశాల విద్యార్థులకు కిట్స్, సైకిళ్లు ఇలా అనేకం తమిళనాట మనకు కనిపిస్తుంటాయి.

ఏ క్షణంలో కామరాజ్ నాడార్ స్కూళ్ళలో ఉచిత మధ్యాహ్న భోజనం స్కీమ్ పెట్టారో కానీ, అప్పటినుంచి తమిళనాడులో ఫ్రీ స్కీమ్ ల బాక్స్ తెరిచినట్టయింది. 1962లో అప్పటి తమిళనాడు సీఎం కామరాజ్ ఈ స్కీమును తీసుకొచ్చారు. ఐదేళ్ళ తరువాత పేదవాళ్ళకు ‘రూపాయికి కిలో బియ్యం’ హామీ ఇచ్చింది డీఎంకే పార్టీ. ఈ స్లోగన్ తో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి, పథకాన్ని అమలు చేసింది కూడా. 14 ఏళ్ళ తరువాత సీఎం అయిన ఎంజీ రామచంద్రన్ స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం స్కీమును మళ్ళీ మొదలుపెట్టారు.

ఈ ఉచిత స్కీములు రాను రాను పెరిగిపోయాయి. 2006 ఎన్నికల్లో డీఎంకే పార్టీ లెక్కలేనన్ని ఆఫర్లు ఇచ్చింది జనానికి. తమ పార్టీకి ఓటేస్తే….ఫ్రీగా కలర్ టీవీ ఇస్తామన్నది వీటిలో టాప్. రెండు రూపాయలకు కిలో బియ్యం, మగవాళ్ళకు ధోవతి, ఆడవాళ్ళకు చీర, ఉచితంగా గ్యాస్ కనెక్షన్, ఉచితంగానే సైకిళ్ళు కూడా మేనిఫెస్టోలో చేర్చారు. దీనితో డీఎంకే గెలిచి, కరుణానిధి మళ్ళీ సీఎం అయిపోయారు. హామీలు మరిచిపోయారనుకుంటే పొరపాటే. హామీలు తీర్చకపోతే తమిళ జనం ఊరుకోరు. ఐదేళ్ళలో కోటిన్నర టీవీలు జనానికి ఇచ్చారు.

ఫ్రీ పథకాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రూటే సపరేటు. ఎందుకంటే జయ ప్రకటించిన ఫ్రీ స్కీం…లిస్ట్ చాంతాడంత ఉంటుంది. జయ ఉచిత వరాల లిస్టు చూద్దాం..

() తమిళనాడులో రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు అందించే పథకం.
() రేషన్ కార్డు ఉన్న మహిళలు స్కూటర్లు కొంటే 50% రాయతీని ప్రభుత్వం భరించే పథకం.
()78 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం.
()నేత కార్మికులకు వివిధ కేటగిరీల వారీగా 200 నుంచి 750 యూనిట్లు ఉచిత విద్యుత్తు పథకం.
() చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ఉచితంగా రూ.500 విలువ గల కూపన్ అందించే పథకం.
() పెళ్లి చేసుకునే జంటలకు ఇస్తున్న మంగళసూత్రాల్లో బంగారం 4 గ్రా. నుండి 8 గ్రాముల పెంపు.
() ప్రసూతి సెలవులు 9 నెలలకు పెంపు, ప్రసూతి సహాయం రూ.12 వేల నుండి రూ. 18 వేలకు పెంపు.
() ప్రభుత్వ ఆధీనంలో నడిచే కేబుల్ టీవీ సంస్థల కనెక్షన్లు తీసుకునే వారికి ఉచిత సెట్ టాప్ బాక్సులు.
() 10+2 తరగతుల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించే పథకం కొనసాగింపు.
() విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే పథకం. ఉచిత వైఫై : బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఉచిత వైఫై సౌకర్యం కల్పించే ఏర్పాటు. ఇంటికో ఉద్యోగం : వృత్తి విద్యా శిక్షణనిచ్చి ప్రతి ఇంటి నుంచి ఒకరికి ఉద్యోగ కల్పన.
()ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణాలకు రూ. 40 లక్షల వరకు రుణ సహాయం.
()రాష్ట్రంలో దశల వారీగా మద్యనిషేధం అమలు చేయాలని నిర్ణయం.
()అమ్మ ఆరోగ్య స్కీమ్ ద్వారా 385 ప్రాథమిక హెల్త్ సెంటర్ల ద్వారా మహిళలకు డయాబెటిస్, ఈసీజీ, కంటి పరీక్షలు, స్పెషల్ మాస్టర్ హెల్త్ చెకప్‌లను ఉచితంగా చేయించుకునే సదుపాయం కల్పించింది.

2006 లో కరుణానిధి చేతిలో ఓడిపోవడానికి ఫ్రీ పథకాలే కారణమని గ్రహించిన అన్నా డీఎంకే చీఫ్ జయలలిత 2011 ఎన్నికల్లో రెండాకులు ఎక్కువే చదివారు. మిక్సీలు, ఫ్యాన్లు, గ్రైండర్లు, ల్యాప్ టాప్ లు, ఉప్పు, సెల్ ఫోన్లు, ఆవులు, మేకలు అన్నీ ఫ్రీ అన్నారు. ఫలితంగా తమిళ రాజకీయాల్లో చరిత్రను తిరగరాస్తు….వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది జయలలిత.