బెంగళూరుకు కేసీఆర్..కుమారస్వామితో భేటీ

kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా రేపు కుమారస్వామి ప్రమాణస్వీకారం చేస్తుండడంతో తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా కుమారస్వామి కేసీఆర్‌ను ఆహ్వానించారు. అయితే రేపు బిజీ షెడ్యూల్ కారణంగా ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశం లేనందున… కేసీఆర్ ఈ రోజు సాయంత్రం బెంగళూరు వెళ్లి కుమారస్వామిని కలిసి అభినందించనున్నారు. ఆ తర్వాత ఈ రోజు రాత్రికే తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు సీఎం కేసీఆర్.

కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు,బెంగాల్ సీఎం మమతా,డీఎంకే నేత స్టాలిన్,బీఎస్పీ చీఫ్ మాయవతితో పాటు సీపీఎం నేతలు ప్రకాశ్ కరాత్,సీతారం ఏచూరి తదితరులు హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బల నిరూపణ తరువాతే మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించాలని కాంగ్రెస్- జేడీఎస్‌లు నిర్ణయానికి వచ్చాయి. 34 మంది మంత్రులుగా కొలువుదీరే అవకాశం ఉండగా, ఇందులో కాంగ్రెస్‌కు 20 , జేడీఎస్‌కు 13 దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం రేసులో పీసీపీ నేత జీ పరమేశ్వర ముందున్నట్టు తెలుస్తుండగా, తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదు. రెండో డిప్యూటీ సీఎం పదవి తెరపైకి వస్తే, వీరశైవ – లింగాయత్ వర్గానికి అది దక్కవచ్చని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. స్పీకర్ పదవి కూడా కాంగ్రెస్ కే ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు సీఎల్పీ నాయకుడిగా సిద్ధ రామయ్యనే కొనసాగించనున్నారు.