రాజమౌళి మరింత ఎత్తుకు ఎదగాలి: కేసీఆర్‌

ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కార ప్రదానోత్సవ వేడుక హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరావు గారు తాను ఎదుగుతూ తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని పెంచారని.. ఆయన పేరుమీద దర్శకుడు రాజమౌళికి ‘అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డ్’ దక్కడం అభినందనీయం అన్నారు.

రాజమౌళి తీసిన ‘బాహుబలి’చిత్రం హిందీ, తెలుగు వెర్షన్‌లలో కూడా తాను చూశానని, అదో అద్భుతమైన కళాఖండం అనడంతో ఎలాంటి సందేహం లేదన్నారు. తెలుగులో కూడా ఎంత బడ్జెట్‌నైనా ఇన్వెస్ట్ చేయొచ్చని ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేసిన ట్రెండ్ సెట్టర్ రాజమౌళి అని ఆయన మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాక్షించారు.

  kcr praises rajamouli

ఇక అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడుతూ.. నాగేశ్వరరావు పాటలంటే తనకు చాలా ఇష్టం అని అప్పట్లో గొప్ప సాహిత్యం ఉండేదన్నారు. ఈ సందర్భంగా ఏఎన్నార్ ‘చిటపటచినుకులు పడుతూ ఉంటే అన్న పాటను సభకు గుర్తుచేసి ఈ పాటను రచయిత గొప్ప సాహిత్యంతో రాశారన్నారు. ఇంత గొప్ప సాహిత్యం ఉన్న పాటలు ఈతరంలో కూడా ఉండే విధంగా సినిమాలో ఒకటైనా ఉండేట్టు చూడాలన్నారు. ఏఎన్నార్ తాను చదువుకోక పోయినా గొప్ప సాహిత్యం ఉన్న అనేక సినిమాల్లో నటించి తెలుగు సినిమా స్థాయిని పెంచారని ఆయన పేరు మీద రాజమౌళికి అవార్డ్స్ ఇవ్వడం అభినందనీయం అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

అనంతరం సీఎం కేసీఆర్ దర్శకుడు రాజమౌళికి ప్రశంసా పత్రాన్ని అందజేయగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, ఆయన సోదరుడు అక్కినేని వెంకట్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.