నేరెళ్ల ఘటనలో దోషులపై చర్యలు:కేటీఆర్‌

KTR

నేరెళ్ల ఘటన దురదృష్టకరమని మంత్రి కేటీఆర్‌ పేర్కోన్నారు. నేరెళ్ల ఇసుక లారీల దహనం కేసులో బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలైన 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేటీఆర్ వేములవాడకు చేరుకుని బాధితులను పరామర్శించి.. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. నేరెళ్ల ఘటన దురదృష్టకరమని, ఇసుక మాఫియాను ప్రభుత్వం ప్రోత్సహించదు అని స్పష్టం చేశారు. పోలీసులు తమను హింసించారని బాధితులు చెబుతున్నారు.. ఈ ఘటనపై డీఐజీ స్థాయిలో విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు. విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇసుక ద్వారా 45 ఏళ్లలో ఎన్నడూ రాని ఆదాయం ఈ మూడేళ్లలో వచ్చిందని ఆయన అన్నారు. ఇసుకను అక్రమంగా తరలించారని విపక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయని… మిడ్ మానేరు ప్రాజెక్టు కోసమే ఇసుకను తరలించామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నాయని, మంత్రి కేటీఆర్. రాష్ట్రంలోని విపక్షాలన్నీ టూరిస్టులైతే, తాను మాత్రం పక్కా లోకల్ అని మంత్రి కేటీఆర్ అన్నారు.