అత్యాధునిక టెక్నాలజీతో మూసీ ప్రక్షాళన..

KTR Review Meeting on Musi Development

మూసీ నది మొత్తాన్ని సర్వే చేయాడానికి రంగం సిద్ధంచేస్తోంది ప్రభుత్వం. ఈమేరకు బేగంపేట్‌ క్యాంపు కార్యలయంలో సంబంధిత అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. సుమారు 40 కిలోమీటర్ల వరకు డ్రోన్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో సర్వే చేయించాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. గతంలో ఉన్న శాటిలైట్ మ్యాపులతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పరిశీలిస్తున్న మూసి నది వెంబడి రోడ్ల ప్రతిపాదనపై మంత్రి సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుకూలంగా నదికి ఇరువైపుల రోడ్లు, నదిపై నుంచి ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే, రెండింటి కలయికతో కూడిన ప్రణాళికలను రూపొందించాలన్నారు. వీటి కోసం అయ్యే ఖర్చు, సాద్యాసాద్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రోడ్లకు అనుబంధంగా రూపకల్పన చేస్తున్న బ్రిడ్జీల డిజైన్లు, నిర్మాణం సైతం చారిత్రక, సంస్కృతికి అద్దంపట్టేలా ఉండాలన్నారు.

KTR Review Meeting on Musi Development

అయితే ఈ మూసీ నదితో పాటు నగరంలోని చెరువుల అభివృద్ధిపై బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మూసి రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. మూసి అభివృద్ధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మూసి నది అభివృద్ధి, సుందరీకరణ లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ తయారీ జరగాలన్నారు.

నగర పరిధిలోని చెరువుల అభివృద్ధి ప్రణాళికలను మంత్రి ఈ సమావేశంలో సమీక్షించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులను దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకొని దశల వారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఈ సంవత్సరం వర్షాకాలం నాటికి కనీసం 50 చెరువులను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 20 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. వీటితో పాటు దుర్గం చెరువు సుందరీకరణ పనులు వేగంగా నడుస్తున్నాయన్నారు. వర్షాకాలం నాటికి ఆయా చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించడంతో పాటు, బండ్ అభివృద్ధి చేయడం లాంటి పనులు ప్రారంభించాలన్నారు. చెరువులను అభివృద్ధి చేసేలోపల అవి కబ్జా కాకుండా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.