విద్యార్థి శక్తి చూపిద్దాం: కేటీఆర్‌

KTR speech at TRSV meet
KTR speech at TRSV meet

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ నినాదాన్ని అణచివేయాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని, తెలంగాణకు నెం.1 శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్వీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రి కే తారక రామారావు, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్వీ కోఆర్డినేటర్లుగా ఉన్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆనాడు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్సేనని.. ఇప్పుడేమో తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటుందని మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ తెలంగాణను దయాదాక్షిణ్యాలతో ఇవ్వలేదు.. తెలంగాణ ఇవ్వకపోతే వీపు చింతపండు అవుతుందనే భయంతోనే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణకు మేలు చేయాలనుకున్న ఏ నేతను కాంగ్రెస్ నెగలనీయలేదని గుర్తు చేశారు.

ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్న కేటీఆర్.. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్వీ సైన్యంగా పని చేసిందన్నారు. ఇప్పుడు కూడా బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్వీ పని చేయాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. జయశంకర్ సార్ లేని లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు. ఏ అంశంలో సందేహాన్నైనా నా నివృత్తి చేసే ఎన్‌సైక్లోపీడియా జయశంకర్‌సార్ అని తెలిపారు కేటీఆర్. ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వాలనే ఆలోచన గతంలో ఏ సీఎంకు గుర్తు రాలేదన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టారని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి సంఘం నాయకులకు ప్రజాప్రతినిధులుగా, వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా అవకాశం కల్పించినట్లు గుర్తు చేశారు. టీఆర్‌ఎస్వీలో చురుగ్గా పనిచేసిన బాల్క సుమన్‌కు ఎంపీగా, గ్యాదరి కిశోర్‌కు ఎమ్మెల్యేగా, పిడమర్తి రవి, చిరుమళ్ల రాకేశ్, వాసుదేవరెడ్డి వంటివారికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశాలు కల్పించామన్నారు. విద్యార్థి సంఘంలో కొనసాగే వారికి ఇలాంటి అవకాశాలు వస్తాయన్నారు. విద్యార్థులకు రాజకీయాల గురించి తెలియాజేయాలి.. మన దైనందిన జీవితంలో రాజకీయం ముడిపడి ఉంది.. ఈ పదిహేను రోజులు బాగా పనిచేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో 31 జిల్లాల్లో విధ్యార్థి సదస్సులు జరగాల్సి ఉందన్నారు.. ఈ సదస్సులన్నీ జరిగిన తరువాత హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర విధ్యార్థి విభాగం ఆధ్వర్యంలో లక్షలాది విద్యార్థులతో రాష్ట్ర స్థాయిలో సదస్సు నిర్వహిద్దమన్నారు.. విద్యార్థి శక్తిని దేశం మొత్తం తెలిసేలా చేద్దామన్నారు..