మహానటి…మీదగ్గరకు వస్తోంది

mahanati

తెలుగు ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లెజండరి నటి సావిత్రి బయోపిక్ మహానటి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. సావిత్రిలా నటించడంలో కీర్తి సురేశ్ మంచి మార్కులు కొట్టేసింది.

ఇప్పటివరకూ కథానాయకుల సరసన ఆడుతూ పాడుతూ అలరిస్తూ వచ్చిన కీర్తి సురేశ్, కథా భారాన్ని పూర్తిగా తనపై వేసుకుని నడిపించిన సినిమా ఇది. ఆమెలోని నటిని పూర్తిస్థాయిలో వెలికి తీసిన సినిమా ఇది.అందువల్లనే ఇప్పుడు ఎక్కడ చూసినా కీర్తి సురేశ్ ప్రస్తావనే వినిపిస్తోంది.

మరోవైపు వైజయంతి మూవీస్ మరో వినూత్న ఆలోచనతో సినిమాకు మరింత పబ్లిసిటీ వచ్చేలా ప్లాన్ చేసింది.జూన్ 3వ వారంలో మహానటి మీదగ్గరకు వస్తుంది…తన తరం వారిదగ్గరకు తరలివస్తుంది తానే అంటూ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందుకోసం ఓల్డేజ్ హోమ్ వివరాలను vyjayanthimahanati@gmail.comకి పంపించాలని సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కోరింది.

విడుదలై రెండు వారాలు గడుస్తున్న మహానటి వసూళ్ల జోరు మాత్రం ఆగడం లేదు. తెలుగురాష్ట్రాల్లోనే కాదు ఓవర్సిస్‌లోనూ సత్తాచాటింది మహానటి. వరల్డ్ వైడ్‌గా 42.80 కోట్ల గ్రాస్, 23.3 కోట్లు షేర్ సాధించినట్టు లెక్కలు కడుతున్నారు. ఇక ఏపీ, నైజాం ఏరియాల్లో 21. 90 కోట్ల గ్రాస్, 12.80 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, దర్శకుడు క్రిష్, అవసరాల శ్రీనివాస్, షాలిని పాండే .. తదితరులు నటించిన ‘మహానటి’ పై సినీ,రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు గుప్పిస్తున్నారు.