రివ్యూ: మహానటి

Mahanati movie review

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన లెజెండరీ యాక్టర్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ప్రేక్షకుల ముందుకువచ్చేసింది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న నటి సావిత్రి. ఆమె జీవితం మొత్తం తెరచిన పుస్తకం. తెలుగు చిత్ర పరిశ్రమకే వన్నె తెచ్చిన సావిత్రి బయోపిక్‌ని నాగ అశ్విన్ తెరకెక్కించగా కీర్తి సురేష్,సమంత,దుల్కర్ సల్మాన్,విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన సావిత్రి బయోపిక్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం….

కథ:

తీవ్ర అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లిపోయిన సావిత్రి (కీర్తి సురేష్‌)ని ఆస్పత్రిలో చేరుస్తారు. ఆవిడ సాధారణ మహిళ అనుకొని అందరు పేషెంట్లలాగానే చూస్తారు. కానీ ఆమె ‘మహానటి’ సావిత్రి అని తర్వాత అభిమానులు ఆస్పత్రికి పోటెత్తుతారు. ప్రజావాణి పత్రిక జర్నలిస్ట్‌గా సావిత్రి కథ రాసే బాధ్యతను మధురవాణి(సమంత)కు అప్పగిస్తారు. ఫొటో జర్నలిస్ట్‌ విజయ్‌ ఆంటోనీ(విజయ్‌ దేవరకొండ)తో కలిసి ఆమె పరిశోధన మొదలు పెడుతుంది. కోమాలోకి వెళ్లడానికి ముందు సావిత్రి ఏం చేసింది? బెంగళూరులో సావిత్రి ఎవరిని కలవడానికి వచ్చింది..? తర్వాత ఏం జరిగింది అనేది తెరమీద చూడాల్సిందే.

Mahanati movie review

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,నటీనటుల ప్రదర్శన. కీర్తి సురేష్…సావిత్రిగా ఒదిగిపోయింది. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. చక్కని భావోద్వేగాలతో సినిమాను మరో స్దాయికి తీసుకెళ్లింది. కీర్తి తెరపై కనపడిన ప్రతీ సన్నివేశంలో మనకు సావిత్రి కనిపిస్తారు. అంత చక్కగా నటించింది. మధురవాణిగా సమంత నటన ఆకట్టుకుంది. సావిత్రి జీవిత విశేషాలను పరిశోధించే వ్యక్తిగా ఆ పాత్రలో జీవించింది. ఫొటో జర్నలిస్ట్‌గా విజయ్‌ అలరిస్తాడు. ఇక ఏఎన్నార్‌గా నాగ చైతన్య ,ఎస్వీఆర్‌గా మోహన్ బాబు, దర్శక నిర్మాత చక్రపాణిగా ప్రకాశ్ రాజ్, కెవి చౌదరిగా రాజేంద్ర ప్రసాద్, క్రియేటివ్ డైరెక్టర్ కె.వి. రెడ్డి పాత్ర‌లో.. క్రిష్ జాగ‌ర్ల‌మూడి, ద‌ర్శ‌క‌, నిర్మాత ఎల్వీ ప్ర‌సాద్ పాత్ర‌లో అవ‌స‌రాల శ్రీనివాస్, అలాగే జెమినీ గ‌ణేష‌న్ మొద‌టి భార్య అలివేలు పాత్ర‌లో మాళ‌విక నాయ‌ర్, సావిత్రి చిన్న‌నాటి స్నేహితురాలు సుశీల‌ పాత్ర‌లో షాలినీ పాండే నిజ పాత్రలకు ఏమాత్రం తీసిపోకుండా నటించారు.

మైనస్ పాయింట్స్:

సినిమలో మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లో కొంచెం వేగం తగ్గడం..

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు ఎలాంటి వంకపెట్టలేం. చాలా హై స్టాండర్డ్స్‌తో తీశారని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సంగీతం అందించిన మిక్కీ జె మేయ‌ర్ అదిర‌పోయే బ్యాంగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి స‌న్నివేశాల‌కు ప్రాణం పోశాడు. డానీ సంచేజ్-లోపెజ్ సినిమాటోగ్ర‌ఫీ మెయిన్ హైలెట్ అని చెప్పాలి.. ఆనాటి వాతావర‌ణాన్ని మ‌న‌కు క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు. కొటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాగుంది. ఆ కాలం నాటి పరిస్థితులను పునః సృష్టించేందుకు చిత్ర బృందం చాలా కష్టపడింది. ప్రతి సన్నివేశంలో ఆ కష్టం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్ధాయిని పెంచేశాయి.

Mahanati movie review

తీర్పు:

దక్షిణభారత దేశంలో తొలి మహిళా నటి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. సావిత్రి బాల్యం నుంచి జీవిత చరమాంకం వరకూ ఆమె జీవితంలో చోటు చేసుకున్న వివిధ ఘటనల సమాహారమే ‘మహానటి’. 1960 కాలం నాటి పరిస్థితులను తలపించే విధంగా తెరకెక్కిన ఈ చిత్రం అద్భుత దృశ్యకావ్యం. తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం తరతరాలు గర్వి౦చే  చిత్రం  ‘మహానటి’.

విడుదల తేదీ:09/05/2018
రేటింగ్: 3/5
నటీనటులు : కీర్తి సురేష్, సమంత, దుల్క‌ర్ సల్మాన్, విజయ్ దేవరకొండ
సంగీతం : మిక్కీ జె మేయ‌ర్‌
నిర్మాతలు : అశ్వినీ ద‌త్, స్వ‌ప్న‌ద‌త్, ప్రియాంక ద‌త్
దర్శకత్వం : నాగ అశ్విన్