రాజకుమారికి మగాళ్ళు సీతాకొక చిలుకలు..

‘ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా..ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ప్రాబ్లమ్‌ ఆకుకే’. ఇది పాత ముచ్చట. దీనికి ధీటుగా కొందరు కొత్త సామెతలు కూడా సృష్టించారు. అదంతా వేరే విషయం. కానీ..ఇదే సామెతకు తగ్గట్టుగా రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి మరో కొత్త ముచ్చటను చెప్పుకొచ్చారు. ఇప్పుడు మగాళ్ళంటే ఎవరో కొత్త నిర్వచనం తెలిపారు.

 mens is butterflies says nannapaneni rajakumari

మగాళ్లు సీతాకొక  చిలుకల్లాంటి వారని, ఆడపిల్లలు పూబంతులని చెప్పారు. అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ఆ సీతాకొక  చిలుకలు( మగాళ్ళు) రంగు రంగుల ఆకర్షణలతో రకరకాల వేషాలు వేస్తుంటారని, అలాంటి వారి ఆకర్షణకు అమ్మాయిలు లోనుకావద్దని, మాన, ప్రాణ, ఆత్మరక్షణ కోసం అవసరమైతే అంతం చేయడానికి సిద్ధమవాలని, ఎదురుతిరగాలని అన్నారు. అంతేకాకుండా ఇవన్నీ చెప్పుకొచ్చిన ఆమె మగాళ్లందరూ చెడ్డవారు కాదని కూడా అన్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుళ్లు.. భార్గవి, తిరుమల, నాగరత్న, నిర్మల గత 45 రోజులుగా 1200 కి.మీ. సైకిల్‌పై తిరుగుతూ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమం చేపట్టారు. గురువారం (డిసెంబర్ 7) చిత్తూరులో జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి హాజరైన నన్నపనేని రాజకుమారి ఈ సందర్భంగా మాట్లాడారు.

mens is butterflies says nannapaneni rajakumari

కొన్ని టీవీ సీరియళ్లు కూడా మహిళలపై వేధింపులకు కారణమవుతున్నాయని నన్నపనేని అన్నారు. స్త్రీలను చులకనగా చూపడం, నేర ప్రవృత్తిని రెచ్చగొట్టేలా సన్నివేశాలు ఉండటం, అసభ్యంగా చూపడం వల్ల సమాజంలో మహిళల పట్ల ఎక్కువగా వేధింపులు, దాడులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. సమాజం ఎటువైపు పోతోంది, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను నేర్పించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని ఆమె పేర్కొన్నారు.

ఇదే క్రమంలో పిల్లలను, యువతను పెడదోవ పట్టిస్తున్న అశ్లీల వెబ్‌సైట్లు, యూ ట్యూబ్‌ వీడియోలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి రాతపూర్వకంగా అందిస్తామని కూడా చెప్పారు. ఇక ఇదంతా బాగానే ఉన్నా..సాధారణంగా అమ్మాయిలు రంగు రంగుల దుస్తులతో మెరిసిపోతుంటారు. అందుకే వారిని కొందరు సీతాకొక  చిలుకల్లా పోల్చుతుంటారు. కానీ ఇక్కడ రాజకుమారి మగాళ్ళను సీతాకొక  చిలుకలతో పోల్చడమే కాస్త విడ్డూరంగా ఉంది.