ఎన్టీఆర్‌ బయోపిక్… బాలయ్యగా మోక్షజ్ఞ?

Mokshagna in Ntr Biopic as Balaiah..?

మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒకటి వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కాగా మరొకటి తేజ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌పై రోజుకోవార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇక తేజ దర్శకత్వంలో తెరకెక్కే ఎన్టీఆర్ బయోపిక్‌తో బాలయ్య నిర్మాతగా కూడా మారనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా తెరకెక్కించనున్నారు. అయితే, ఇందులో ఎన్టీఆర్ పాత్రను ఎవరు పోషిస్తారనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణే పోషించబోతున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు.

ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుంది. ఈ బయోపిక్‌లో స్వర్గీయ నందమూరి తారకరామారావు సినిమాల్లో ఎలా ఎదిగారు, ముఖ్యమంత్రి ఎలా అయ్యారనే విషయాలను చూపించబోతున్నారు. కథ ప్రకారం సినిమాలో ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య పాత్ర కూడా ఉండబోతుంది. ఇప్పుడు కథకు ఆ పాత్ర కీలకంగా మారింది. ఆ పాత్రలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ నటిస్తే ఎలా ఉంటుందనే చర్చలు మొదలయ్యాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మోక్షజ్ఞ యంగ్ బాలయ్య పాత్రలో కనిపించడం ఖాయమనే ప్రచారం టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

తాత బయోపిక్‌, తండ్రి బాలయ్య సొంత బ్యానర్‌లో మనవడు పరిచయం అయితే అభిమానులకు ఆ ఆనందమే వేరు. పైగా అది కూడా బాలయ్య పాత్రలో ఇక సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోతాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకున్నారని సమాచారం.