గోదావరి జలాలతో మేడ్చల్ సస్యశ్యామలం…

Our Aim is to Develop Bangaru Telangana

గోదావరి జలాలతో మేడ్చల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చేసంవత్సరం నాటికి మేడ్చల్ జిల్లాలోని 370 చెరువులను గోదావరి జలాలతో నింపుతామని తెలిపారు.  ముడుచింతలపల్లి గ్రామసభలో పాల్గొన్న సీఎం బంగారు తెలంగాణ పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని  పిలుపునిచ్చారు. గ్రామాలు బాగుపడి తెలంగాణలో సంపద పెరగాలన్నారు. 21 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్ధానంలో నిలిచిందని…ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారని తెలిపారు.

ఈ సందర్భంగా మూడు చింతలపల్లి గ్రామానికి వరాల జల్లు కురిపించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న కేసీఆర్ వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. తెలంగాణ యోధులు వీరారెడ్డి,వెంకట్రామిరెడ్డి పుట్టినగడ్డ ఇది అన్న  కేసీఆర్….వీరారెడ్డి పేరుతో గ్రామంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో శంకుస్థాపన చేసి…ఆరు నెలల్లో వైద్యశాల పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే సంవత్సరం మూడు చింతలపల్లికి గోదావరి నీళ్లు వచ్చి తీరుతాయని తెలిపారు. త్వరలో శామీర్ పేట మండలంలో సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మూడు చింతలపల్లి పచ్చబడాలన్న కేసీఆర్ ఇందుకు గ్రామస్తులంతా సహకరించాలన్నారు. ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేస్తామని వాటిని కాపాడాల్సిన బాధ్యత మీదేనన్నారు. మూడు చింతలపల్లి నుంచి చింతమామిడి వరకు డబుల్ రోడ్డును మంజూరు చేస్తున్నట్లు తెలిపిన కేసీఆర్ గ్రామానికి సీసీ రోడ్లు, మల్టీపర్పస్‌ కమ్యూనిటి హాల్, దోబిఘాట్, స్మశాన వాటిక,వెటర్నరీ హాస్పిటల్‌ను మంజూరు చేస్తున్నానని తెలిపారు. గ్రామానికి 100 డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లను మంజూరు చేస్తున్నాని తెలిపారు.

మూడు చింతపల్లి నుంచి లక్ష్మాపూర్ వెళ్లే దారిలో మినీస్టేడియం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడుచింతపల్లిలో అభివృద్ది పనులకు సంబంధించి రెండు,మూడు రోజుల్లో జీవోలు జారీ చేస్తామని వెల్లడించారు. లింగాపూర్ తండా త్వరలో గ్రామపంచాయతీ అవుతుందన్నారు. రూ.30 లక్షలతో మహిళా సంఘాల కోసం భవనం నిర్మిస్తామని చెప్పారు.

ప్రతి ఊరి  భూమి లెక్కలు ఖచ్చితంగా ఉండాలన్న కేసీఆర్ … నకిలీకి ఆస్కారం లేకుండా కొత్తపాస్‌ బుక్‌లు తయారవుతున్నాయని చెప్పారు. దీని ద్వారా ప్రతిరైతుకు లబ్దిచేకూరుతుందని … పాస్ బుక్స్ కోసం ఒక్కరూపాయి పైసా ఇవ్వాల్సిన పనిలేదన్నారు. యాసంగి నుంచి వ్యవసాయానికి  24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. మిత్తి,అప్పుల్లేని రైతులను చూడటమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.