మోదీపై దావా వేసిన ప్రియాంక..!

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ)లో మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డ ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దావా వేసింది. నీరవ్ కు చెందిన డైమండ్ బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరించే తనకు ఓ వ్యాపార ప్రకటనకు సంబంధించిన పారితోషికం ఆయన ఎగ్గొట్టారంటూ కోర్టులో దావా వేసినట్టు తెలుస్తోంది.

కొన్ని నెలల క్రితం బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ప్రియాంక ఈ వ్యాపార ప్రకటనలో నటించింది. ఈ వ్యాపార ప్రకటనకు సంబంధించిన పారితోషికాన్ని ఆమెకు, సిద్ధార్థ్ మల్హోత్రాకు ఇంత వరకూ ఇవ్వలేదని బాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా, పీఎన్ బీలో నీరవ్ మోదీ కుంభకోణం బయటపడటంతో నీరవ్ సన్నిహితులు, బాలీవుడ్ సెలెబ్రిటీలు అతనికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం.

Priyanka Chopra sues Nirav Modi

ఈ స్కామ్‌లో ప్రధాన అనుమానితుడిగా ఉన్న నిరవ్ మోదీ ఇల్లు, ఆఫీసులు, షోరూమ్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడి చేసింది. ముంబై, ఢిల్లీలలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ముంబై బ్రాంచ్‌లో ఏకంగా 11360 కోట్ల కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే.

విదేశాల్లో ఉన్న కొందరు కస్టమర్లకు అక్రమంగా ఈ మొత్తాన్ని తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిరవ్ మోదీపై రెండు ఫిర్యాదులు వచ్చినట్లు సీబీఐ కూడా వెల్లడించింది. పది వేల కోట్ల మోసం జరిగినట్లు ఆ ఫిర్యాదులు దాఖలైనట్లు తెలిపింది. ఇప్పటికే 280 కోట్ల మరో స్కామ్‌లో నిరవ్ మోదీని సీబీఐ విచారిస్తున్నది. జనవరి 31న ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులూ నిరవ్ మోదీ ఇంటిపై దాడులు చేశారు. ఇక్కడి బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై అండర్‌టేకింగ్ లెటర్లు సంపాదించి వాటిని విదేశాల్లో సొమ్ము చేసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.