చేప చిన్నదే… కానీ ప్రాణం తీసింది….

small fish kills man in tamilnadu

కొన్ని సందర్భాలలో మనుషులు చేసే చిన్న చిన్న పనులే వారి ప్రాణాలను బలితీసుకుంటుంటాయి. అలాంటి సంఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో సిద్ద లింగమఠం గ్రామంలో చేపలు పట్టేందుకు అదే గ్రామానికి చెందిన అన్నామలైతో పాటు మరి కొందరు జాలర్లు వెళ్లారు. అందరూ చేపలను పట్టేందుకు చెరువులో వలలు వేశారు. అయితే అన్నామలై వలలో ఓ చిన్న చేప పడింది. ఆ చేప వలకు కొన అంచున ఇనుపచువ్వకు ఇరుక్కుపోయింది.

ఆ ఇనుప చువ్వకు ఇరుక్కున్న చేపను తీసేందుకు అన్నామలై ఆ చేపను నోటితో పట్టుకుని వల కొనను బలంగా లాగాడు. అయితే బలంగా లాగడంతో అన్నామలై పట్టుకున్న చేప అమాంతం నోట్లోకి జారిపోయింది. నోట్లికి జారిపోయిన చేప గొంతులో ఇరుక్కుపోవడంతో అన్నామలై ఊపిరి ఆడక కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన జాలర్లు వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా వైద్యులు చేపను బయటకు తీసే క్రమంలోనే అన్నామలై ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటనపై తిరుక్కోవిలూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.