రిస్క్‌ చేస్తున్న రవితేజ…!

Srinu Vaitla and Ravi Teja to reunite...!

ఇండస్ట్రీ లో హిట్స్ ఉంటె నెత్తి మిద పెట్టుకొని చూసుకుంటారు. అదే ఫ్లాప్స్ ఉంటె కాళ్ళ కింద పడేసి తొక్కేస్తారు. ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి ఇలాగే ఉంది. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్న శ్రీను వైట్ల ని హిట్స్ ఉన్నప్పుడు ఇండస్ట్రీ నెత్తి మిద పెట్టుకొని చూసుకుంది.  మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, నాగార్జున, వెంకటేష్ లాంటి టాప్ హీరోలకు పనిచేసిన ఈ అగ్రదర్శకుడు…‘దూకుడు’ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసి టాలీవుడ్‌ను తనవైపు తిప్పుకున్నాడు. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు అగ్రహీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా క్యూ కట్టేవారు.

కానీ టైం బ్యాడ్ అయితే అరటిపండు తిన్నా పన్ను ఇరుగుద్దనే డైలాగ్ శ్రీను వైట్లకి అతికించినట్టు సరిపోతుంది. చాలాకాలం గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్‌తో చేసిన మిస్టర్‌ ప్రయత్నం బెడిసికొట్టింది. లేటైనా లెటెస్ట్‌గా సత్యాన్ని గ్రహించినట్లు రొటీన్ కథల్ని పక్కన పెట్టేసి మళ్లీ డిఫరెంట్ స్టైల్‌లో ట్రై చేస్తా.. ఒక్కచాన్స్ ప్లీజ్ అనడంతో ఓ బడా హీరోతో పాటు ఓ పెద్ద సంస్థ ఈయనతో సినిమా తీసేందుకు ముందుకు వచ్చినట్టు టాక్.

వెంకీ, దుబాయ్ శీను లాంటి హిట్ చిత్రాలను రవితేజకు అందించిన శ్రీనువైట్లతో మరో సినిమా చేసేందుకు మాస్ రాజా రవితేజ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతకాదు ఈ దర్శకుడిపై ఉన్న నమ్మకంతో మాస్ రాజా డైరెక్ట్‌గా రంగంలోకి దిగి ‘మైత్రీ మూవీ మేకర్స్’ లాంటి పెద్ద సంస్థతో డీల్ ఓకే చేయించాడట రవితేజ. అయితే ఈ సినిమాకి రవితేజ రెమ్యునరేషన్ డిమాండ్ చేయకుండా నిర్మాతలు ఎంతిస్తే అంత అని ఫిక్స్ అవ్వడంతో ‘మైత్రీ మూవీ మేకర్స్’ సినిమా తీసేందుకు ముందుకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం రవితేజ.. రాజా దిగ్రేట్, టచ్ చేసి చూడు సినిమాలతో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాదికి శ్రీనువైట్లతో సినిమా పట్టాలెక్కించే అవకాశం ఉంది.