కమల్‌ను ఇడియట్‌ అన్న బీజేపీ నేత…

Subramanya Swamy Comments Against Kamal Hassan

తన అద్భుత నట విన్యాసాలతో భారత సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కమల్ హాసన్. నటనతో పాటుగా తన వ్యక్తిత్వంతోనూ ఆయన గొప్ప ఇమేజ్ సంపాదించుకున్నాడు. తమిళ రాజకీయాలపై ఇటీవల విమర్శల వర్షం కురిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు కమల్ హాసన్‌. ఆయన్ని అంత సులువుగా ఎవరూ ఒక మాట అనరు. కానీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి మాత్రం కమల్ హాసన్ ఒక ఇడియట్ అనేశారు. కొన్నాళ్లుగా తమిళనాడు రాజకీయాలపై కమల్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Subramanya Swamy Comments Against Kamal Hassan

కమల్‌ హాసన్‌ తమిళ నేతల్ని అటాక్ చేస్తుంటే.. సుబ్రమణ్యస్వామి కమల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటికే రజినీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన స్వామి.. తాజాగా కమల్ ను టార్గెట్ చేశారు. ‘‘ఈ ఇడియట్ కమల్ హాసన్ సీపీఎంలో చేరుతున్నట్లుగా విన్నాను’’ అని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. తాను వామ పక్ష పార్టీలను మాత్రమే సపోర్ట్ చేస్తానంటూ కమల్ హాసన్ ఇటీవలే వ్యాఖ్యానించిన నేపథ్యంలో స్వామి ఈ ట్వీట్ చేశారు. కొన్నాళ్లుగా కమల్ తీరు చూస్తుంటే ఆయన త్వరలోనే రాజకీయారంగేట్రం చేయబోతున్నట్లుగా కనిపిస్తోంది.

ఆయన తాను ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపాలోకి వచ్చేది లేదన్న సంకేతాల్ని ఇచ్చారు. రజినీకాంత్ సైతం కమలం పార్టీలో చేరడానికి ఇష్టపడలేదు. ఆ పార్టీ అధినాయకత్వం రజినీని దువ్వేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమ పార్టీలోకి రానందుకే రజినీ.. కమల్ హాసన్ ల మీద సుబ్రమణ్యస్వామి ఇలా అటాక్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. మరి ఎవరినైనా దీటుగా ఎదుర్కొనే కమల్.. స్వామి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.