‘ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడు’..

కులాల గురించి కంచె ఐలయ్య రాసిన పుస్తకాలు ఎంత దుమారాన్ని రేపుతున్నాయో తెలిసిందే. ఇప్పటికే తన రచనలో వైశ్య వర్గాల వారిని ఐలయ్య అవమానించారంటూ వైశ్య సంఘాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మధ్య కంచె ఐలయ్య చిచ్చు పెడుతున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.

ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లు ఆయనపై నిప్పులు చెరిగారు. ఐలయ్య సామాజిక ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన మేధావి కాదని, ప్రశాంతంగా ఉంటూ, అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న రాష్ట్రంలో లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

TRS Leaders Fire on Prof Kancha Ilaiah

కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించేలా పుస్తకాలు రాయడమేంటని ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్, ఆయన తన పుస్తకాన్ని స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవాలని కోరారు. బాల్క సుమన్ మాట్లాడుతూ, సమస్యకు సామరస్యంగా ముగింపు పలికితే బాగుంటుందని సూచించారు.

ఈ మేరకు ఐలయ్యే, వైశ్య సంఘాల ప్రతినిధులతో మాట్లాడాలని తెలిపారు. ఇదే సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే బిగాల గణేష్, తనకు ప్రాణహాని ఉందంటూ ఐలయ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఆయన ఓ విదేశీ ఏజంట్ లా మారిపోయారని ఆరోపించారు.