నిపా వైరస్.. వ్యాధి లక్షణాలివే..!

Nipah-Virus

నిపా వైరస్‌తో కేరళ వణికిపోతోంది.గబ్బిలాలు, పందులు తదితర జంతువుల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వైరస్‌తో ఇప్పటివరకు 9 మంది చనిపోయారు. మరో 20మందిలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. వీరిలో 12మంది పరిస్థితి విషమంగా ఉంది. కొజికోడ్ వైద్యకళాశాలలో వీరిని ప్రత్యేక పరిశీలనలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

నిపా వైరస్‌ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో నర్సు లినీకి ఆ వైరస్ సోకింది. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె నివాసం ఉంటున్న ప్రాంతంలో పాడుబడిన బావిని గుర్తించారు. అందులో మరణించిన కొన్ని గబ్బిలాలను గుర్తించిన అధికారులు వెంటనే ఆ బావిని పూడ్చేయించారు.

Image result for Nipah virus

తొలిసారిగా నిపా వైర్‌సను 1998లో మలేసియాలో కనుగొన్నారు. అప్పట్లో మలేసియాలో 105 మంది ఈ వ్యాధితో మృతి చెందారు. ఆ తర్వాత సింగపూర్‌లోనూ ఈ వైర్‌స్‌ను కనుగొనగా పందులను పెంచే పశుపోషకులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. 2004లో బంగ్లాదేశ్‌లో,అనంతరం మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాల్లో ఈ వైరస్‌ వెలుగుచూసింది.

నిపా వైరస్‌ బారిన పడిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణాలు 3-14 రోజుల వరకు ఉంటాయి. జ్వరం, తలనొప్పి, మగత, మానసిక సంతులనం తగ్గడం, శ్వాసకోశ ఇబ్బందులు, ఎన్‌సెఫలైటిస్‌, మయోకార్డైటిస్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. దీని నివారణకు వ్యాక్సిన్‌ లేదు.

ఈ ప్రాణాంతక వైరస్‌ ఆందోళన కలిగించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో వెంటనే కేరళకు ప్రత్యేక బృందాన్ని పంపుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మరోవైపు కేరళ పొరుగు రాష్ర్టాలైన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అప్రమత్తమయ్యాయి.