1961న శంకుస్థాపన.. 2017న జాతికి అంకితం

World's Second Biggest, Sardar Sarovar Dam

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజు కానుకగా దేశంలో మరో బృహత్తర ప్రాజెక్టుకు నేడు ప్రారంభోత్సవం జరిగింది. గుజరాత్‌లోని నర్మద జిల్లా కెవాడియాలో కావేరి నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఆరు దశాబ్దాల క్రితం మాజీ దివంగత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రు 5 ఏప్రిల్, 1961న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పలు అవాంతరాలను అధిగమించి ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేటికి జరిగింది. ఈ డ్యామ్ ప్రపంచంలోనే రెండో పెద్ద ప్రాజెక్టు. యూనైటెడ్ స్టేట్స్‌లో ఉన్న గ్రాండ్ కౌలీ డ్యామ్ మొదటిది.

sardar-sarovar-dam_650x400_61505625872

దీని నిర్మాణానికి 1945లోనే భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ ఆలోచన చేశారు. ముంబైకి చెందిన ప్రముఖ ఇంజనీర్ జమ్దేశ్ జీ దీనికి ప్లాన్ ఇవ్వగా, నర్మద జిల్లా కెవాడియాలో 1961 ఏప్రిల్ 15న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి డ్యామ్ పూర్తి కావడానికి ఇంతకాలం పట్టింది. దీని నిర్మాణానికి సుమారు రూ. 65 వేల కోట్లు ఖర్చయ్యాయి.డ్యామ్‌ నిర్మాణ నేపథ్యంలో పర్యావరణం, పునరావాసం తదితర అంశాలకు సంబంధించి అనేక వివాదాలూ ఉన్నాయి. చివరకు నర్మద నిర్వహణ సంస్థ తుది ఎత్తును ఖరారు చేసి ఈ ఏడాది జూన్‌ 17న డ్యామ్‌ గేట్లు మూసివేసి.. ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.68 మీటర్లకు పెంచారు. దీంతో నీటి నిల్వ సామర్ధ్యం 4.73 మిలియన్‌ ఎకరపు అడుగులకు పెరిగింది. ఎత్తు పెంచిన డ్యామ్‌నే ప్రధాని మోడీ ప్రారంభించారు.

modi sardar dam

భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించే నర్మదా నదికి మత, సాంస్కృతిక, జీవనపరంగా అధిక ప్రాముఖ్యం ఉంది. నర్మదా నదిపై 1961 నుంచి నిర్మాణంలో ఉన్న సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, నర్మదాసాగర్ డ్యామ్‌లతో లక్షలాది మంది స్థానిక గిరిజనులు, రైతులు, సామాన్య ప్రజలు నిరాశ్రయులుకావడంతో పాటు పర్యావరణ సమతుల్యత (Ecological balance) దెబ్బతింటుందని ప్రముఖ పర్యావరణ ఉద్యమ నాయకురాలు మేథాపాట్కర్ నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమాన్ని ప్రారంభించింది.

SARDARSAROVARDAM

1980వ దశకంలో తీవ్రరూపం దాల్చిన నర్మదా బచావో ఆందోళన్ నర్మదా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రపంచబ్యాంక్ అందిస్తున్న ఆర్థికసహాయాన్ని వెంటనే నిలిపివేయాలని పోరాటం చేశారు. ఈ ఉద్యమ ప్రభావంతో నర్మదా నది నిర్మాణానికి సంబంధించి 1991లో ప్రపంచ బ్యాంక్ మూర్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా మేథోపాట్కర్‌తో పాటు బాబా ఆమ్టే, నందితాదాస్, అరుంధతిరాయ్ వంటి పర్యావరణ ఉద్యమకారులు ఉద్యమించారు.

నర్మదా బచావో ఆందోళన చివరకు ఒక ప్రజా ఉద్యమంగా మారడం, సుప్రీంకోర్టులో దీనిపై వ్యాజ్యాలు వేయడంతో సుప్రీంకోర్టు 1996లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించింది. అనంతరం 2000 అక్టోబర్‌లో మిగిలిన పనులు చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. అప్పటి నుంచి పనులు వేగంగా జరిగాయి. ఐదు దశాబ్దాల కల సాకారం అయ్యింది. దీని కారణంగా గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలు ప్రయోజనం పొందనున్నాయి. పది లక్షల మంది రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందనుంది. 4 కోట్లమంది ప్రజలకు తాగునీటి ప్రయోజనం చేకూరనుంది.