నేనే ప్రధాని అభ్యర్థిని….

Yes, Ready To Be PM Candidate Signals Rahul

వచ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నానని….పార్టీ ప్రతిపాదిస్తే 2019లో ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీపడేందుకు సిద్దంగా ఉన్నానని ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ కాలిఫోర్నియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

దేశంలోని బంధుప్రీతి, వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, అన్ని రంగాల్లో వారసత్వం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. సినీ రంగంలో అభిషేక్ బచ్చన్, వ్యాపార రంగంలో ముఖేష్ అంబానీ పేర్లను ప్రస్తావించిన ఆయన, ఇదో సమస్యేనని, అయితే, ఇండియాలో అధికంగా జరిగేది ఇదేనని పేర్కొన్నారు. “అలాగే అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే కొనసాగుతోంది… ఇండియాలో ఇది సర్వసాధారణం. కాబట్టి కేవలం నా వెనుకే పడవద్దు. అఖిలేష్ యాదవ్, స్టాలిన్ లాంటి వారెందరో ఉన్నారు.

ప్ర‌ధాని మోడీ పాల‌నపై కూడా రాహుల్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. విభ‌జ‌న రాజ‌కీయాల‌తో మోడీ దేశాన్ని చీలుస్తున్నార‌ని ఆరోపించారు. త‌న‌తో ప‌నిచేస్తున్న ఎంపీల‌తోనూ మోడీ అభిప్రాయాలు పంచుకోలేర‌న్నారు. స‌భ‌ల్లో జ‌నం కోసం వివిధ ర‌కాల సందేశాల‌ను ఇవ్వ‌డంలో మోడీ దిట్ట అని, చాలా ప్ర‌భావంత‌మైన సందేశాల‌ను ప్ర‌ధాని ఇస్తార‌ని రాహుల్ అన్నారు.

మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చింది కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. రాహుల్ … విఫల రాజవంశీయుడని అంటూ చురకలటించింది.  భారతదేశ ప్రధాని,రాష్ట్రపతి,ఉపరాష్ట్ర పతి వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారు కారని తెలిపింది.  రాహుల్ రాజకీయాల్లో రాణించలేరని … కుటుంబపాలన చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారని తెలిపింది. అహంకారమే కాంగ్రెస్‌ను  దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు.