భూమిక…జగనన్న వదిలిన బాణం కాదు…!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఖుషీ చిత్రంలో న‌టించి మెప్పించిన అందాల భామ భూమిక‌. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి కాస్త దూర‌మైన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అదరగొడుతోంది. నాని వదినగా ఎంసీఏ చిత్రంలో అలరించిన భూమిక ప్రస్తుతం సమంత-ఆది పినిశెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యూటర్న్‌ చిత్రంలో నటిస్తోంది. అయితే తాజాగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర సినిమాలో నటిస్తోందని వార్తలు వెలువడ్డాయి.

ఈ వార్తలను ఖండించారు చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్. వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటిస్తోందన్న వార్తల్లో నిజంలేదని తెలిపాడు. అసలు ఈ సినిమాలో షర్మిల పాత్రే లేదని చెప్పిన ఆయన భూమికకు సరిపోయే పాత్ర సినిమాలో లేదన్నారు. అటు భూమిక సైతం తనపై వస్తున్న రూమర్లను ఖండించింది.

2004లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో ప్రతిపక్షనేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర కీలక భూమిక పోషించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ బయోపిక్‌కు యాత్ర అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి ..వైఎస్‌గా నటిస్తోండగా ఆయనకు నమ్మినబంటు సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి నటిస్తున్నారు. వైఎస్ ఆత్మ కెవిపి రాంచందర్‌ రావు పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు. దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.